Chandrababu: మోదీ, కేసీఆర్ లు గతంలో ఏం మాట్లాడారో వరుసబెట్టి క్లిప్పింగ్స్ చూపించిన చంద్రబాబు

  • గత ఎన్నికల్లో మోదీ ఏం చెప్పారో చూపిన వైనం
  • కేసీఆర్ పేడ బిర్యానీ వ్యాఖ్యలు కూడా ప్రదర్శన
  • ఓ క్లిప్పింగ్ లో జగన్ పై కవిత ఆశ్చర్యకర వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం అమరావతి ప్రజావేదికలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పిన వైనాన్ని అందరికీ గుర్తుచేశారు. అందుకోసం గత ఎన్నికల్లో మోదీ ఏపీలో బహిరంగ సభల్లో ఏమేమి హామీలు ఇచ్చారో ప్రత్యేకంగా క్లిప్పింగ్ లు వేసి ప్రదర్శించారు. ఆ రోజు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేశాడు? అనేది ఒక్కసారి తిరుపతి సభ చూస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పి క్లిపింగ్స్ ప్లే చేశారు.

కొత్త రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, ఢిల్లీ కూడా దానిముందు చిన్నబోవాలని మోదీ చెప్పడం ఆ క్లిప్పింగ్ లో కనిపించింది. ఏపీ ప్రతి అభివృద్ధిలో కేంద్రం భుజం భుజం కలిపి నడుస్తుందని మరో క్లిప్పింగ్ లో చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఆరోజు చెప్పినదానికి ఇప్పుడు చేస్తున్నదానికి ఏమాత్రం పొంతనలేదని, రాష్ట్రాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓటేసే ముందు ప్రతి ఆంధ్రుడు ఆలోచించుకోవాలని, మోదీ, కేసీఆర్, జగన్ ఈ ముగ్గురూ రాష్ట్రంపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆ తర్వాత కేసీఆర్ గతంలో ఏమన్నాడో కూడా క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. "మీ ముఖాలకు బిర్యానీ కూడా వండొస్తదా.. పెండలాగుంటది!" అని ఓ క్లిప్పింగ్ లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరో క్లిప్ లో "కేసీఆర్ గారూ మా ఉలవచారు టేస్ట్ తెలుసా అన్నాడు, అరే ఉల్వలు నాకెందుకు తెల్వదురా భయ్! మా దగ్గర ఎడ్లకు పెడతాం అన్నాన్నేను" అంటూ ఎద్దేవా చేయడం కనిపించింది. ఆఖరికి కల్వకుంట్ల కవిత కూడా పోలవరం ప్రాజక్ట్ కు వ్యతిరేకంగా తామేం చేశామో వివరంగా చెప్పడం మరో క్లిప్ లో చూపించారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పుడేమన్నారో ఇప్పుడేమన్నారో కూడా చంద్రబాబు స్వయంగా యాంకరింగ్ చేస్తూ ఒక్కో క్లిప్ ను ప్రదర్శించారు. ఓ క్లిప్ లో కవిత మాట్లాడుతూ, జగన్ వస్తాడు, పోలవరం కడతాడు, అంటున్నారని, అన్ని కేసులున్న నాయకుడ్ని తెలంగాణ జైళ్లలో కూడా ఉంచబోమని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడ్ని తమ జైళ్లలో పెడితే జైళ్ల భూముల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. పెడితే రాజమండ్రి జైల్లో పెట్టుకోండి అంటూ కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తే ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడారని, పోలవరం కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, కృష్ణా జలాలు రాకుండా చేస్తున్నారని తేటతెల్లమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News