Jana Sena: పవన్ వ్యాఖ్యలకు అలీ గట్టి కౌంటర్.. తనకెలా సాయపడ్డారో చెప్పాలని డిమాండ్!
- మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి
- ఎవరి అండా లేకుండానే సినీ పరిశ్రమలోకి వచ్చాను
- దేహీ అనే పరిస్థితి వస్తే అలీ ఉండడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్న అలీ.. తన బాటను తానే వేసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. పవన్‌కు చిరంజీవి ఉన్నారని, కానీ తనకెవరూ లేరని అన్నారు. పవన్ స్థానం ఎప్పుడూ తన గుండెల్లోనే ఉంటుందని గతంలోనే చెప్పానన్న అలీ.. వైసీపీ కోసం తాను చాలాప్రాంతాల్లో ప్రచారం చేశానని, కానీ ఎక్కడా పవన్ గురించి పల్లెత్తు మాట అనలేదన్నారు. పవన్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొట్టమొదటివాడినని తెలిపారు.
అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆదుకున్నానన్న పవన్ వ్యాఖ్యలపై అలీ స్పందిస్తూ.. ఏ విధంగా తనకు సాయం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. పవన్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే తాను మంచి పొజిషన్‌లో ఉన్న విషయాన్ని అలీ స్పష్టం చేశారు. తానెవరినీ చేయి చాచి అడగలేదని, ఎవరినీ రూపాయి కూడా అడగలేదని పేర్కొన్నారు. అలా అడిగే అవకాశం వస్తే అలీ ఉండడని అన్నారు. అల్లా దయవల్ల తాను బాగానే ఉన్నానని, దేహీ అనే స్థితికి రాలేదని అన్నారు.
వైసీపీలోకి వెళ్లడంలో ఉన్న తప్పేంటని పవన్‌ను అలీ ప్రశ్నించారు. అదేమైనా నేరమా? లేక, రాజ్యాంగంలో రాసుందా? అని నిలదీశారు. తన చుట్టానికి టికెట్ ఇచ్చానని పవన్ అన్నారని, అతనికి టికెట్ ఇవ్వాలని తానేమైనా అడిగానా? అని ప్రశ్నించారు. పోనీ ఇచ్చేముందు నన్నేమైనా అడిగారా? అని నిలదీశారు. తననెప్పుడూ పార్టీలోకి రమ్మని పవన్ అడగలేదని వివరించారు. అటువంటి పవన్ నేడు తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు.