Chandrababu: చివరి నిమిషంలో కేసీఆర్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

  • సోనియా గాంధీ హోదా ఇస్తామని చెప్పగానే అడ్డుతగిలారు
  • నీ బోడి పెత్తనం మాకు కావాలా?
  • మోదీ, కేసీఆర్, జగన్ ఎవరి ఆటలు సాగనివ్వను

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పెడనలో నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుండగా ఏపీకి ప్రత్యేక హోదాకు తాము మద్దతిస్తామంటూ కేసీఆర్ చెప్పడాన్ని చంద్రబాబు తూర్పారబట్టారు.

"ఒకప్పుడు మనతోనే కూర్చున్నాడు. ఇప్పుడు నన్నే చాలెంజ్ చేస్తున్నాడు, ఇప్పుడిప్పుడే దార్లోకొస్తున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేసీఆర్  మాట్లాడుతున్నారు, సంతోషం. ఇప్పుడే కాదు తెలంగాణ ఎన్నికల కంటే ముందు కూడా హోదా ఇవ్వాలనే మాట్లాడారు. కావాలనే మీరు హోదా గురించి మాట్లాడారు. కానీ నరేంద్ర మోదీ హోదా ఇవ్వట్లేదని చెప్పాక, మోదీతో మేం విభేదించాక హోదా వద్దని మీరు మాట మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మేం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఎందుకు మద్దతు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి.

మొన్న సోనియా గాంధీ మేడ్చల్ వచ్చారు. మేం మాటిచ్చాం, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆమె చెప్పారు. మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పారు. కానీ ఆ రోజు కేసీఆర్ ఏపీకి ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని అడ్డుతగిలాడు. ఎక్కడ మనకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, రాయితీలు వెళ్లిపోతాయని అభ్యంతరం చెప్పాడు. నేను తెలంగాణకి వస్తే ఆంధ్రా వాళ్లకు ఇక్కడే పెత్తనం అన్నావు. మరి నీ బోడి పెత్తనం మాకు కావాలా? ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు కోడికత్తి పార్టీకి డబ్బులు పంపించారు? రూ.1000 కోట్లు పంపించి లక్ష కోట్లు ఎగ్గొట్టాలనుకుంటున్నావా?" అంటూ నిప్పులు చెరిగారు.

తాను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే నరేంద్ర మోదీ కానీ, కేసీఆర్ కానీ, ఈ కోడికత్తి కానీ, ఎవరి ఆటలు సాగవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News