Hyderabad: హైదరాబాద్ ‘మెట్రో’ గురించి కేంద్రం పట్టించుకోవట్లేదు: కేటీఆర్
- హైదరాబాద్ ‘మెట్రో’ను మరింత విస్తరించాలి
- ముంబై ‘మెట్రో’ విస్తరణకు రూ.18 వేల కోట్లు ఇచ్చారు
- మోదీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పుకునే పరిస్థితి లేదు
హైదరాబాద్ ‘మెట్రో’ గురించి కేంద్రం పట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక కేబీఆర్ గార్డెన్ లో ఎల్బీనగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ‘మెట్రో’ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముంబైలో ‘మెట్రో’ విస్తరణకు కేంద్రం రూ.18 వేల కోట్ల నిధులు ఇచ్చిందని, హైదరాబాద్ ను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎల్బీనగర్ వాసులు కోరినట్టుగా అత్యాధునిక బస్ టర్మినల్ నిర్మిస్తామని, హైదరాబాద్ లో ఉన్న చెరువులను సుందరీకరిస్తామని, మూడు నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
కేంద్రం మెడలు వంచి నిధులు సాధిద్దాం
ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పుకునే పరిస్థితి లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేంద్రం మెడలు వంచి అవసరమైనన్ని నిధులు సాధించవచ్చని, కేసీఆర్ లాంటి పోరాడే నాయకుడు ఉంటే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి అవసరమైనన్ని నిధులు సాధించవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని, తెలంగాణలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా, జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరితే మొండిచేయి చూపారని విమర్శించారు.