Andhra Pradesh: మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా.. ఆయనకు తప్ప ఎవరికైనా ఓటువేయండి!: సినీ నటుడు శివాజీరాజా

  • నాగబాబు వల్ల ‘మా’ ప్రతిష్ట దిగజారింది
  • 600 మందికి న్యాయం చేయలేనోడు నరసాపురానికి చేస్తాడా?
  • విమర్శలు గుప్పించిన ‘మా’ మాజీ అధ్యక్షుడు

మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు  రాత్రికిరాత్రే మద్దతు ఇచ్చారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన సదరు వ్యక్తులు రెండు రోజుల తర్వాత మెగా ఫ్యామిలీని మళ్లీ తిట్టారని వ్యాఖ్యానించారు. నాగబాబు వల్ల ‘మా’ ప్రతిష్ట దిగజారిపోయిందనీ, అభివృద్ధిలో రెండేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. 600 మంది సభ్యులు మాత్రమే ఉన్న ‘మా’కు న్యాయం చేయలేని నాగబాబు నరసాపురం ప్రజలకు ఏమి చేస్తాడని ప్రశ్నించారు. జనసేన తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాగబాబుకు ఓటేయవద్దని నరసాపురం ప్రజలకు శివాజీ రాజా విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీకి అయినా ఓటేయాలనీ, నాగబాబుకు మాత్రం వేయవద్దని కోరారు. ‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్‌ కల్యాణ్‌ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది.. నరసాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?

భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా? నరసాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్‌లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నరసాపురం వెళ్లి సేవ చేస్తావా?’  అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడూ చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు.

Andhra Pradesh
Nagababu
Jana Sena
Pawan Kalyan
shivajiraja
  • Loading...

More Telugu News