Andhra Pradesh: 'పసుపు-కుంకుమ' డబ్బులు పాత బాకీలకు జమ అవుతున్నాయట!: బీజేపీ నేత ఐవైఆర్
- ఇది సాధారణ బ్యాంకింగ్ ప్రక్రియే
- చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది
- బాబు ఇక బ్యాంకు అధికారులను కూడా తిట్టడం ప్రారంభిస్తారేమో
ఏపీ ప్రభుత్వం ‘పసుపు-కుంకుమ’ పథకం అందజేస్తున్న నగదును బ్యాంకర్లు పాత బకాయిలకు జమ చేసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. మనం ఒకటి తలిస్తే బ్యాంకరు మరొకటి తలంచడం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు.
ఇదంతా సాధారణ బ్యాంకింగ్ ప్రక్రియలో భాగమేనని వ్యాఖ్యానించారు. దీంతో ఈ నిధుల జమ వల్ల చంద్రబాబుకు ఫలితం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి చంద్రబాబు బ్యాంకు అధికారులను కూడా తిట్టడం ప్రారంభిస్తారేమో? అని అనుమానం వ్యక్తం చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘మనం ఒకటి తలిస్తే బ్యాంకరు ఒకటి తలుస్తాడు. పసుపు కుంకుమ డబ్బులు పాత బాకీలకు జమ అవుతున్నాయట. అది సాధారణ బ్యాంకింగ్ ప్రక్రియ. ఇంత శ్రమపడి ముఖ్యమంత్రి గారి మాటల్లోనే ఐటీ రైడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ పథకాల ధనం జమ చేస్తున్నాను అన్న నిధుల తరలింపు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు.మరి రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు బ్యాంకు అధికారులను తిట్టడం ప్రారంభిస్తారు ఏమో’ అని ట్వీట్ చేశారు.