Andhra Pradesh: పవన్ కల్యాణ్ అస్వస్థతపై భావోద్వేగంతో స్పందించిన తనయుడు అకీరా నందన్!

  • నిన్న వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన పవన్
  • వైద్యుల సూచనలో నేడు ఎన్నికల ప్రచారం రద్దు
  • ఫేస్ బుక్ లో స్పందించిన పవన్ కల్యాణ్ కుమారుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు తరఫున ఆయన కుమార్తె నిహారిక ఎన్నికల ప్రచారంలో దిగారు. ఆమెకు తోడుగా నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురంలో హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు కుమారుడు అకీరా నందన్ నుంచి మద్దతు లభించింది.

ఈరోజు ఫేస్ బుక్ లో అకీరానందన్ స్పందిస్తూ..‘గతకొద్దిరోజులుగా సరైన నిద్ర లేకున్నా, వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైనా తెనాలి సభకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. నాన్న కష్టపడుతున్న తీరు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.  ఓ వ్యక్తి ఎంతమేరకు కష్టపడాలో అంతమేరకు కష్టపడుతున్నారు. సర్వస్వం ధారపోస్తున్నారు’ అని తండ్రిని ప్రశంసించారు.

అంతకుముందు నాగబాబుకు తన మద్దతు ఉంటుందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ట్విట్టర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన సమాజంలో మార్పు తీసుకొస్తుందని తాను భావిస్తున్నట్లు బన్నీ పేర్కొన్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న వడదెబ్బ తగలడంతో పవన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పవన్ కల్యాణ్ వైద్యుల సూచన మేరకు ఎన్నికల ప్రచారాన్ని నేడు రద్దు చేసుకున్నారు.

Andhra Pradesh
Pawan Kalyan
Facebook
akira nandan
emotional
  • Loading...

More Telugu News