Sharmila: షర్మిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి హైకోర్టులో చుక్కెదురు!
- కేసును కొట్టివేయాలంటూ పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు పిటిషన్
- కొన్ని వ్యాఖ్యలు మాత్రమే చేశానన్న పిటిషనర్
- కేసును విచారించి తోసిపుచ్చిన జస్టిస్ షమీమ్ అక్తర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే విద్యార్థికి కోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ను విచారించిన జస్టిస్ షమీమ్ అక్తర్, దాన్ని తోసిపుచ్చారు.
అంతకుముందు వెంకటేశ్వరరావు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, తన క్లయింట్ అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టింగ్స్ కింద, కొన్ని వ్యాఖ్యలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలపై స్పందించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేకమేనని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, వెంకటేశ్వరరావు కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.