mukhtar abbas naqvi: తీరుమారని బీజేపీ నేతలు.. ఆర్మీని ‘మోదీ సేన’గా కీర్తించిన కేంద్రమంత్రి నఖ్వీ
- మొన్న ఆర్మీని మోదీ సేనగా అభివర్ణించిన యూపీ సీఎం
- నేడు కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ
- తానలా అనలేదని వివరణ
ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా, ఎన్నికల సంఘం నోటీసులు ఇస్తున్నా బీజేపీ నేతలు లెక్కచేయడం లేదు. భారత ఆర్మీని ‘మోదీ ఆర్మీ’గానే పరిగణిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీని ‘మోదీ సేన’గా అభివర్ణించారు. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఆ వివాదం నడుస్తుండగానే, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నఖ్వీ మాట్లాడుతూ.. ఆర్మీని మరోమారు ‘మోదీ ఆర్మీ’గా అభివర్ణించారు. పాక్‌లోని ఉగ్రశిబిరాలపై ‘మోదీజీ సేన’ నిర్వహించిన దాడులకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఆధారాలు అడుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. తానలా అనలేదని నఖ్వీ పేర్కొన్నారు.