Chandrababu: పసుపు-కుంకుమ పథకానికి తొలగిన అడ్డంకులు... పచ్చజెండా ఊపిన ఢిల్లీ హైకోర్టు
- జనచైతన్య వేదిక పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం
- పథకం కొనసాగించవచ్చంటూ తీర్పు
- టీడీపీ వర్గాల్లో హర్షం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పథకం పసుపు-కుంకుమ. అయితే, ఎన్నికల ముంగిట డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ నిధులు పంపిణీ చేయడం నిలిపివేయాలంటూ జనచైతన్య వేదిక ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే, ఆ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పసుపు-కుంకుమతో పాటు అన్నదాత సుఖీభవ, పింఛన్లు పంపిణీపై ఉన్న అభ్యంతరాలను కోర్టు కొట్టిపారేసింది.
అంతకుముందు, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, అవి పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. దానికి సంబంధించి ఈసీ ఆదేశాల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు అందించారు. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఈసీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు పేర్కొంది. ఈ తీర్పుతో టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.