jagan: 150 మంది వైసీపీ అభ్యర్థులపై కేసులున్నాయి... వీరితో రాజన్న రాజ్యం తీసుకొస్తారా?: టీడీపీ నేత శేషసాయిబాబు
- 12 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి
- అఫిడవిట్ లో చాలా మంది కేసులున్నట్టు చూపించలేదు
- రాష్ట్రాన్ని దోచుకోవడానికి వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలా?
వైసీపీ నుంచి ఎంపీలుగా పోటీ చేస్తున్న వారిలో 12 మంది అభ్యర్థులపై కేసులున్నాయని... ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారిలో 95 మందిపై క్రిమినల్ కేసులున్నాయని టీడీపీ నేత శేషసాయిబాబు ఆరోపించారు. 12 మందిపై హత్యాయత్నం కేసులున్నాయని... ఏసీబీ, సీబీఐ, ఈడీ కేసుల్లో 8 మంది ఉన్నారని చెప్పారు. మొత్తమ్మీద 150 మంది అభ్యర్థులపై కేసులున్నాయని... వీరిలో చాలా మంది అభ్యర్థులు కేసులున్నట్టు అఫిడవిట్ లో చూపించలేదని అన్నారు. వీటన్నింటినీ బయటకు తీసుకొస్తామని తెలిపారు.
హత్య కేసులున్న వారిని వైసీపీ అభ్యర్థులుగా జగన్ ఎందుకు ప్రకటించారని సాయిబాబు ప్రశ్నించారు. కేసులున్న నాయకులతో రాజన్న రాజ్యాన్ని జగన్ ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులున్నవారికే సీట్లిస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వైసీపీ పెట్టాలని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలా? అంటూ ఎద్దేవా చేశారు.