Telangana: మహేశ్ బాబు 3 గంటల్లో చేసేస్తాడు.. కానీ మాకు మాత్రం కొంచెం కష్టం!: నవ్వులు పూయించిన కేటీఆర్
- రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం
- కొందరు రాత్రికిరాత్రి పనులు జరిగిపోవాలనుకుంటున్నారు
- తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సభలో కేటీఆర్
తెలంగాణలో రియల్ఎస్టేట్ రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో పర్యావరణ కమిటీని నియమించకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందనీ, దీన్ని వెంటనే క్లియర్ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
మధ్యలో కొన్నిరోజులు మినహాయిస్తే గతేడాది అక్టోబర్ నుంచి ఎన్నికల కోడ్ తెలంగాణలో కొనసాగుతోందని కేటీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ ను విశ్వనగరం చేసుకుందాం’ అని తాము చెప్పినప్పుడు కొందరు వ్యక్తులు మాత్రం తెల్లారేసరికే మార్పు రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంత్రదండం కానీ, అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటివి నిజంగా ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వాటి అవసరం తమలాంటి రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉంటుందన్నారు.
‘ప్రజలు ఎవరైనా వచ్చి అన్నా రోడ్డు బాగోలేదు. డ్రైనేజీ సమస్య ఉంది అని వస్తే రాత్రికిరాత్రి మంత్రదండంతో సమస్యను పరిష్కరించవచ్చు. ప్రజలతో తిట్టించుకోవాలని ఎవ్వరికీ ఉండదు. కొత్తగా నగరాన్ని అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టడం చాలా తేలిక. కానీ హైదరాబాద్ లాంటి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు చాలా కష్టం. అందులో ఎన్నో చిక్కులు ఉంటాయి. హైదరాబాద్ పరిస్థితి అదే’ అని వ్యాఖ్యానించారు.
ఈ సమస్యలు అన్నింటిని పరిష్కరించాలంటే మరికొంత సమయం పడుతుందనీ, సినిమాల్లో చూపించినట్లు 3 గంటల్లో అన్నీ అయిపోవాలంటే కష్టమని అన్నారు. సినిమాల్లో మహేశ్ బాబు చేస్తాడేమో కానీ ఇక్కడ మాత్రం కొంచెం కష్టమని నవ్వులు పూయించారు. హైదరాబాద్ లో గంటకు 2 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే తట్టుకునే సామర్థ్యం ప్రస్తుత మురుగునీటి వ్యవస్థకు లేదని స్పష్టం చేశారు.