Chandrababu: ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు
- మోదీ, కేసీఆర్, జగన్ లాలూచీ బయటపడింది
- ముగ్గురూ ముసుగు తీసేశారు
- అద్దంకి సభలో సీఎం ప్రసంగం
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా అద్దంకి సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఐటీ దాడులకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్, జగన్ ల లాలూచీ బయటపడిందని అన్నారు. ముగ్గురూ ముసుగు తీసేశారని మండిపడ్డారు. భార్య ఒక పార్టీ, భర్త మరో పార్టీ అని ఎద్దేవా చేసిన చంద్రబాబు, బీజేపీ, వైసీపీలది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని, భార్యభర్తల అనుబంధం అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ రెండింటిది అవినాభావ సంబంధం అని స్పష్టం చేశారు. కలిసి పోటీచేయుచ్చు కదా? అని వ్యాఖ్యానించారు.
"మోదీ, కేసీఆర్, జగన్ మీ ముగ్గురి కథేంటో ఒకేసారి చూస్తా, తగిన శాస్తి చేస్తా! ఆరో తారీఖు ఉగాది నాడు అందరూ సంకల్పం బూనాలి, ఆంధ్రులకు పునర్వైభవం రావాలని ప్రార్థించాలి. ఆ తర్వాత ఈ దుర్మార్గులు పోవాలంటూ ఏడో తారీఖున అన్ని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో దేవుడి ఆశీస్సులు తీసుకుందాం. ఎనిమిదో తారీఖున అందరూ బయటికి వచ్చిన సంఘీభావ యాత్రలు చేయాలి. దేశంలో ఆంధ్రుల జోలికి ఎవరైనా రావాలంటే భయపడేలా ఉండాలి" అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.