Chandrababu: చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన మతపెద్దలు

  • మోదీ భజన చేసే జగన్ కు క్రైస్తవులు మద్దతిస్తారా?
  • బీజేపీకి బానిసగా మారిన వైసీపీకి ముస్లింలు ఓటేస్తారా?
  • చంద్రబాబు విసుర్లు

రాష్ట్రంలోని ప్రముఖ మతపెద్దలు, బోధకులు సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబును కలిసిన వారిలో పాస్టర్లు, ఇతర మతప్రచారకులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రధాని మోదీ భజనలో తరించిపోతున్నారని, అలాంటి వ్యక్తికి క్రైస్తవులు మద్దతిచ్చే పరిస్థితులున్నాయా? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ బీజేపీ పార్టీకి బానిసగా మారిందని, మరి ముస్లింలు ఏంచూసి వైసీపీకి ఓటేయాలని నిలదీశారు. జగన్ నిన్న కూడా లోటస్ పాండ్ లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యారని, టీఆర్ఎస్ ప్రతినిధులు కూడా వచ్చారని చంద్రబాబు ఆరోపించారు.

అధికారం కోసం జగన్ చేయని ప్రయత్నమంటూ లేదని, కేసుల మాఫీ కోసం మోదీతో, ఆస్తుల కోసం కేసీఆర్ తో చేతులు కలిపారని మండిపడ్డారు. 'ఇకపై రాష్ట్రంలో మైనారిటీల ఓట్లు తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, క్రైస్తవ మతబోధకులపైనా దాడులు చేయిస్తున్నారు, దౌర్జన్యాలను ప్రతిఘటించే మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులు తనతో చాలా సన్నిహితంగా ఉంటారని, దేశంలోని వ్యవస్థలకు రక్షణ కల్పించాలంటూ మతపెద్దలు ప్రార్థనలు చేయాలని సూచించారు. ఆఖరికి నా ఇంటికి వచ్చేవాళ్లపైనా నిఘా పెడతారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు చేస్తే ఓట్లు వస్తాయా? ఏం తినాలో ఏం మాట్లాడాలో వాళ్లే నిర్ణయిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

కేరళ తుపాను బాధితులకు దుబాయ్ విరాళం ఇస్తుంటే మోదీ వద్దన్నారని తెలిపారు. "ముస్లిం సంస్థలు డబ్బులిస్తే మోదీ వద్దన్నారు, బాధితులను ఆదుకునేందుకు మతం ఎందుకు? మతవిద్వేషంతో ఆర్థికసాయాన్ని అడ్డుకోవడం అమానుషం" అంటూ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News