Chandrababu: పట్టణాల్లోని పేదలకు ఉచితంగా రూ. 10 లక్షలలోపు ఫ్లాట్... మేనిఫెస్టోలో చేర్చనున్న చంద్రబాబు!
- రుణం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే
- ఇప్పటికే వేల కొద్దీ ప్లాట్లు నిర్మాణ దశలో
- ఖజానాపై రూ. 12 వేల కోట్లకు పైగా భారం
ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి, మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మరో కీలక హామీని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 10 లక్షలలోపు ఖరీదు చేసే ఇళ్లను పేదలకు ఉచితంగా అందించాలని నిర్ణయించారు.
ఇప్పటికే పేద వర్గాలకు అపార్టుమెంట్లు నిర్మిస్తున్న టీడీపీ సర్కారు పట్టణాల్లో రూ. 10 లక్షల కన్నా తక్కువ ధరలో నిర్మితమైన ఇళ్లను లబ్దిదారులకు ఫ్రీగానే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 300, 360, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇప్పటికే వేలకొద్దీ ప్లాట్లు నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ అపార్టుమెంట్ల నిర్మాణానికి పల్లె ప్రాంతాల్లో తక్కువగా ఖర్చవుతుంటే, పట్టణాల్లో ఎక్కువగా, నగరాల్లో మరింత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కేంద్రం కొంత సాయాన్ని అందిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్మాణాలకు అధికంగా ఖర్చు చేస్తోంది. మిగతా డబ్బును లబ్దిదారులు భరించాల్సి వుంది. ఇకపై లబ్దిదారులు ఎవరూ డబ్బు కట్టాల్సిన పనిలేదని, ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పట్టణాల్లో చదరపు అడుగును రూ. 3 వేల వరకూ విక్రయిస్తుండగా, అన్ని సౌకర్యాలు, స్థలం, నిర్మాణం విలువ కలిపి రూ. 10 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. చంద్రబాబు తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 12,800 కోట్ల భారం పడుతుందని అంచనా.