gudivada: ఓటమి భయం వల్లే కొడాలి నాని షర్మిలతో ప్రచారం చేయిస్తున్నాడు: టీడీపీ అభ్యర్థి అవినాశ్

  • ఆయన కుల రాజకీయాలు మానుకోవాలి
  • నాది మచ్చలేని జీవితం
  • గూండా రాజకీయాలు చేసేది ఆయనే

సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీకి  ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని, దీంతో ఓడిపోతానన్న భయంతో కొడాలి నాని గుడివాడలో జగన్‌ సోదరి షర్మిలతో సభ పెట్టించుకున్నారని టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ విమర్శించారు. కేవలం చంద్రబాబును తిట్టించడానికే నానీ షర్మిలను ఇక్కడకు రప్పించారని విమర్శించారు.

పదిహేనేళ్లపాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే ఓటర్లు నానీని తిరస్కరిస్తున్నారని గుర్తు చేశారు. ఓటమి భయంతో ఉన్న ఆయన తనపై అవాకులు, చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. తనను గూండా అని, తన అనుచరులను రౌడీలని నానీ వర్ణించడంపై మండిపడ్డారు.

తన జీవితం ఏమిటో ప్రజలకు తెలుసునని, తన తండ్రి ఎంతో క్రమశిక్షణతో తనను పెంచారని చెప్పుకొచ్చారు. గూండా రాజకీయాలు, కుల రాజకీయాలు చేసేది కొడాలి నానీయే అన్నారు. ఎన్నికల వేళ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని, ఆ తర్వాత హైదరాబాద్‌లో తిష్టవేసి కూర్చునే ఆయనకు ఓట్లడిగే అర్హత లేదని ఎద్దేవా చేశారు. నాని ఎన్ని కుయుక్తులు పన్నినా తాను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని అవినాశ్ ధీమా వ్యక్తం చేశారు.

gudivada
Kodali Nani
devineni avinash
  • Loading...

More Telugu News