Uttar Pradesh: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈసీ ఝలక్... సైన్యాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నోటీసులు!
- భారత సైన్యాన్ని మోదీ సేనగా వర్ణించిన ఆదిత్యనాథ్
- గజియాబాద్ ఎన్నికల సభలో వ్యాఖ్యలు
- కోడ్ ఉల్లంఘనగా భావించి నోటీసులు జారీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. భారత సైన్యాన్ని ‘మోదీ సేన (మోదీజీ కీ సేనా)’గా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో కేంద్రమంత్రి వి.కె.సింగ్ తరపున ప్రచారం చేస్తూ ఆదిత్యనాథ్ ‘ఉగ్రవాదులకు కాంగ్రెస్ బిర్యానీ పెట్టి పోషిస్తే, మోదీ సేన (సైన్యాన్ని ఉద్దేశించి) వారికి బాంబులు, బుల్లెట్లతో సమాధానం చెబుతోంది’ అని వ్యాఖ్యానించారు.
ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. 'మన సైన్యాన్ని అవమానపరిచారు. సైన్యం బీజేపీ సొత్తు కాదు. దేశానికి గొప్ప ఆస్తి’ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. నౌకాదళం మాజీ అధిపతి అడ్మిరల్ రాందాస్ ఈసీకి లేఖ రాస్తూ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు.
విమర్శలు వెల్లువెత్తడంతో దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అందించిన నివేదికలోని వీడియో క్లిప్పింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం ఆదిత్యనాథ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో శుక్రవారం నాటికి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.