Andhra Pradesh: పొన్నూరులో స్కూలు పిల్లల ఆటోలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.. చిన్నారులను కూడా వదిలిపెట్టలేదు !: చంద్రబాబు ఆగ్రహం

  • పుంగనూరులో దారిమూసేస్తాం-గుడిసెలు పీకేస్తాం అని బెదిరించారు
  • టీడీపీని ఎన్నిరకాలుగా వేధించాలో అన్నిరకాలుగా వేధిస్తున్నారు
  • టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం

టీడీపీ నేతలను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగానూ వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గతంలో కొట్టివేసిన కేసులో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేశారని మండిపడ్డారు. మరోవైపు ఐటీ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైలవరంలో ఏకంగా పోలీసులపై కూడా దాడులకు తెగబడుతున్నారన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యుద్ధంలో కనీస సంప్రదాయాలు పాటిస్తారనీ, ఓటమి భయంతో వైసీపీ అన్నింటిని వదిలేసిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నిరకాల నేరాలు, అరాచకాలకు అవకాశముందో అన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలే మనకు శ్రీరామరక్ష’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దుష్ట చతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దారి మూసేస్తాం.. గుడిసెలు పీకేస్తాం అంటూ పుంగనూరులో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పొన్నూరులో స్కూలు పిల్లల ఆటోలపై కూడా వైసీపీ నేతలు దాడి చేశారనీ, చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News