Andhra Pradesh: జగన్ తన రెచ్చగొట్టే ప్రసంగాలతో మైలవరంలో దాడులకు ఉసిగొల్పారు!: మంత్రి దేవినేని ఉమ

  • అధికారులు చెప్పినట్లు కాకుండా మరో రూట్లో జగన్ వచ్చారు
  • సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులకు పాల్పడ్డారు
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిన్న మైలవరంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని వ్యాఖ్యానించారు. జగన్ తన రెచ్చగొట్టే ప్రసంగాలతో దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడారు.

ప్రజలు తన సభకు రాలేదన్న అక్కసుతో జగన్ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వెళ్లారని మంత్రి విమర్శించారు. మైలవరం చరిత్రలోనే ఎన్నడూ లేని అరాచకాన్ని జగన్ సృష్టించారని వ్యాఖ్యానించారు. పోలీసులు, అధికారులు సూచించిన మార్గంలో కాకుండా మరో రూట్ లో జగన్ వచ్చారని ఉమ ఆరోపించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామన్న అక్కసుతో మైలవరానికి వచ్చి రెచ్చగొట్టి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పసుపు-కుంకుమ పథకం నిధులు మహిళలకు అందకుండా కుట్రలు పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ దాడికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. జగన్ వేదిక పైనుంచి దిగగానే వైసీపీ కార్యకర్తలు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం ఏంటని నిలదీశారు.

Andhra Pradesh
Telugudesam
uma
devineni
YSRCP
Jagan
milavaram
  • Loading...

More Telugu News