Hyderabad: పెళ్లి కూతురి క్యారెక్టర్ తెలుసుకోవడానికి వెంటాడిన లేడీ డిటెక్టివ్.. అరెస్ట్ చేసిన పోలీసులు!
- అమ్మాయి గుణగణాలు తెలుసుకోవాలని భావించిన యువకుడు
- డిటెక్టివ్ ఏజన్సీతో డీల్
- ఏజన్సీ నిర్వాకం బట్టబయలు కావడంతో ఫిర్యాదు
తాను చేసుకోవాలని అనుకుంటున్న అమ్మాయి గుణగణాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ యువకుడు డిటెక్టివ్ ఏజన్సీని ఆశ్రయించగా, వారు ఆమెను వెంబడిస్తూ, రహస్యంగా వీడియో తీసి అడ్డంగా దొరికిపోయారు. పెళ్లికి ముందు గుణగణాలపై ఆరా తీస్తూ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న డిటెక్టివ్ ఏజన్సీ, అవమానకరంగా ప్రవర్తించిందని కేసు నమోదుకాగా, రాచకొండ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. జంట నగరాల పరిధిలో ఇటువంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వ్యాఖ్యానించారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లాకు చెందిన దేవంగ మహేశ్, డీఆర్డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తూ, చైతన్యపురిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆపై ఆమె వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలని నాగోల్ లో ఉన్న స్కౌట్ డిటెక్టివ్ ఏజన్సీ నిర్వాహకుడు చిక్కా కిరణ్ కుమార్ ను సంప్రదించాడు. అమ్మాయి సమాచారం, బాయ్ ఫ్రెండ్స్ వివరాలు అడిగాడు. అందుకు రూ. 17 వేలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు.
డిటెక్టివ్ ఏజన్సీలో పనిచేస్తున్న బాతుల సుహాసిని అనే యువతి, ఆ విద్యార్థిని వెంటపడి, ఆమె వీడియో చిత్రీకరించింది. వ్యక్తిగత వివరాలు సేకరించింది. తన బాస్ కిరణ్ తో కలిసి కాలేజీకి వెళ్లి కూడా ఇతర విద్యార్థులను వివరాలు అడిగారు. వీరి వాలకంపై కొందరికి అనుమానం వచ్చి, అమ్మాయి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నిలదీయగా, మహేశ్ గురించి చెప్పారు.
మైనర్ బాలికను వెంబడిస్తూ, రహస్యంగా వీడియో తీయడాన్ని అవమానకరమని భావించిన వారు, చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరికి ఎటువంటి డిటెక్టివ్ ఏజన్సీ నిర్వహించే అనుమతి లేదని, లేబర్ లైసెన్స్ మాత్రమే ఉందని తేల్చారు. పెళ్లికి ముందు అమ్మాయిల వ్యక్తిగత సమాచారం తెలుసుకునే అధికారం ఎవరికీ లేదని అన్నారు.