Perambur: పెరంబూరు నుంచి పోటీ పడుతున్న రిటైర్డ్ పోలీస్ అధికారి.. తన ఆస్తి 1.76 లక్షల కోట్లుగా అఫిడవిట్
- ఎన్నికల సంఘాన్ని ఎగతాళి చేసిన రిటైర్డ్ సీఐ
- ప్రపంచబ్యాంకుకు రూ. 4 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు పేర్కొన్న మోహన్‌రాజ్
- గుడ్డిగా ఆమోదించిన ఎన్నికల సంఘం
తమిళనాడులోని పెరంబూరుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీపడుతున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జె.మోహన్‌రాజ్ (67) ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా మారారు. నామినేషన్ సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ ఏకంగా రూ.1.76 లక్షల కోట్లని ప్రకటించారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో తలపడుతున్న అత్యంత ధనవంతుడిగా మారారు. అదే సమయంలో ప్రపంచ బ్యాంకుకు తాను నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్టు తెలిపారు. విచిత్రంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఈ అఫిడవిట్‌కు ఆమోదముద్ర వేశారు.
మోహన్‌రాజ్ ఆస్తుల గురించి మీడియాకు ఎక్కడంతో ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లోని గుట్టు విప్పారు. 2జీ కుంభకోణం విలువ రూ.1.76 లక్షల కోట్లని, దానిని తన ఆస్తిగా అఫిడవిట్‌లో చూపించానని, ఇక, తమిళనాడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లని, దానినే తన అప్పుగా చూపించానని పేర్కొన్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు తమ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు ప్రకటించుకుంటున్నారని, ఎన్నికల సంఘాన్ని ఎగతాళి చేసేందుకు తన ఆస్తులను అలా ప్రకటించానని మోహన్ రాజ్ పేర్కొన్నారు. తాను సమర్పించిన అఫిడవిట్‌ను గుడ్డిగా ఆమోదించిన ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ పనితీరు ఇలా ఉందని ఎద్దేవా చేశారు.