Brunei: బ్రూనైలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు.. షాక్‌కు గురైన అంతర్జాతీయ సమాజం
- చాలా వరకు నేరాలకు మరణదండనే
- గే సెక్స్‌కు పాల్పడి దొరికితే రాళ్లతో కొట్టి చంపాలని చెబుతున్న చట్టం
- మధ్య యుగం నాటి శిక్షలంటూ వణికిపోతున్న గే సమాజం
బ్రూనై దేశంలో బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు అంతర్జాతీయ సమాజాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హక్కుల కార్యకర్తలు ఈ చట్టాలపై మండిపడుతున్నారు. తాజా చట్టాల ప్రకారం బ్రూనైలో ఇక నుంచి వ్యభిచారం, గే సెక్స్ నేరం. వీటిని చేస్తూ దొరికితే రాళ్లతో కొట్టి చంపుతారు. అలాగే, లైంగిక దాడి, దోపిడీకి కూడా మరణశిక్షే విధిస్తారు. మహ్మద్ ప్రవక్తను అవమానించిన ఎవరైనా అంటే ముస్లింలైనా, ముస్లిమేతరులకైనా మరణదండన తప్పదు.
ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కఠిన షరియా చట్టాలను చూసి బ్రూనైలోని ‘గే’ సమాజం షాక్‌కు గురైంది. భయంతో వణికిపోతోంది. ఇవి ముమ్మాటికీ మధ్యయుగం నాటి శిక్షలేనని ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోమోసెక్స్ బ్రూనైలో ఇప్పటికే నిషిద్ధం. దీనికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించేవారు. ఇప్పుడు ఏకంగా మరణదండన అమలు చేయబోతోంది. బ్రూనై జనాభాలో రెండింట మూడొంతుల మంది అంటే 4.20 లక్షలమంది ముస్లింలే. ఇక్కడ మరణశిక్ష అమల్లో ఉన్నప్పటికీ 1957 తర్వాత ఇప్పటి వరకు ఆ శిక్షను అమలు చేయలేదు. కొత్త చట్టాల అమలు సందర్భంగా బ్రూనై సుల్తాన్ మాట్లాడుతూ.. ఇస్లాం బోధనలను మరింత పటిష్ఠంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.