Maharashtra: పామును చంపేందుకు పొలంలోని వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు.. సజీవదహనమైన ఐదు చిరుత పిల్లలు
- మహారాష్ట్రలోని గవాడీవాడీలో ఘటన
- మృతి చెందిన చిరుత పిల్లల వయసు 15 రోజులు
- గ్రామంపై చిరుత దాడిచేసే అవకాశం ఉందన్న అటవీ శాఖ అధికారి
పామును చంపేందుకు చెరకు తోటలోని వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెడితే ఐదు చిరుత పిల్లలు సజీవ దహనమైన ఘటన మహారాష్ట్ర అంబేగావ్ తాలూకాలోని గవాడీవాడీలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోపీనాథ్‌కు ఉన్న చెరకు తోటలో చెరకు సేకరణకు వెళ్లిన కూలీలకు పాము కనిపించింది. దానిని చంపేందుకు తోటలోని వ్యర్థాలకు నిప్పు పెట్టారు. మంటలు చల్లారాక తోటను గమనిస్తే చనిపోయిన ఐదు చిరుత పిల్లలు వారికి కనిపించాయి. వాటి వయసు 10 రోజులు ఉంటుందని అంచనా. వీటిలో రెండు మగ, రెండు ఆడవి ఉన్నట్టు అటవీశాఖ అధికారి ప్రజోత్ పాల్వే వెల్లడించారు. చిరుత పిల్లల మృతి నేపథ్యంలో దాని తల్లి గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.