janasena: ‘డమ్మీ అభ్యర్థి’ అంటూ అహంకారపూరితంగా మాట్లాడొద్దు: పవన్ కల్యాణ్
- పీహెచ్డీ, సీఏ చదివిన కుర్రాళ్లు డమ్మీ అభ్యర్థులా?
- కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ‘డమ్మీ అభ్యర్థా?
- ఎవరైనా సరే, ఆ పదాన్ని వాడొద్దు
డబ్బున్న వాళ్లే కాదు, చాలా సామాన్యులు కూడా రాజకీయనాయకులు కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ‘టీవీ 99’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కష్టాలు, ఆకలి, జీవిత భారం తెలిసిన వాళ్లే రాజకీయనాయకులు కావాలని, అందుకే, అలాంటి అభ్యర్థులనే నిలబెట్టామని చెప్పారు. కష్టపడకుండా ఏదీ రాదని, కష్టాన్ని బలంగా నమ్మే వ్యక్తిని తాను అని స్పష్టం చేశారు.
టీడీపీతో జనసేన కుమ్మక్కైందని, అందుకే, చాలా స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారన్న వైసీపీ ఆరోపణలపై పవన్ స్పందిస్తూ, ఫలానా అభ్యర్థి ‘డమ్మీ అభ్యర్థి’ అని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పీహెచ్డీ లేదా సీఏ చదివిన కుర్రాళ్లను లేదా కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిని ‘డమ్మీ అభ్యర్థి’ అంటూ అహంకారపూరితంగా ఎలా మాట్లాడతారని, ఎవరైనా సరే, ఆ పద ప్రయోగాన్ని మార్చుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు వేల కోట్లు ఉండాలా? ఉన్నత కులానికి చెందిన వారై ఉండాలా? అని పవన్ ప్రశ్నించారు.