Telangana: మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ వుండగా.. ఇంకా, వేరే పార్టీలెందుకు?: కేటీఆర్
- ఆ పార్టీలకు ఓట్లు వేయడం ఎందుకు?
- ఢిల్లీలో బలం ఉండాలంటే మన ఎంపీలందరూ గెలవాలి
- నాడు ఢిల్లీలో గళ్లా పట్టి నిలదీసే పరిస్థితి మనకు లేదు
మన పార్టీ, మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఉండగా, ఇంకా వేరే పార్టీలు ఎందుకు? ఆ పార్టీలకు ఓట్లు వేయడం ఎందుకు? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మేడ్చల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో మనకు బలం ఉండాలంటే మన ఎంపీ అభ్యర్థులందరిని గెలిపించాలని కోరారు.
నాడు మనకు బలం లేకపోవడం వల్లే ముంపు మండలాలను పోగొట్టుకున్నామని, చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు నాడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ మండలాలను ఏపీలో కలుపుకునేలా చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో గళ్లా పట్టి నిలదీసే పరిస్థితి లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పంపిస్తే, ఆయనకు తోడుగా మన ఎంపీలు మరో పదిహేను మంది ఉంటే మన రాష్ట్రానికి రావాల్సిన పైసలు రావా? అని అన్నారు.