Chandrababu: హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభలో 100 మంది కూడా లేరు... సిగ్గులేదా మీకు!: మోదీపై చంద్రబాబు ఫైర్
- వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టారు
- మోదీ నమ్మించి మోసం చేశారు
- వినుకొండ సభలో చంద్రబాబు ధ్వజం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వినుకొండలో ఇవాళ జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంపై మండిపడ్డారు. తెలుగు వాళ్లను నమ్మించి మోసం చేశారని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టారంటూ విమర్శించారు.
నమ్మకద్రోహం చేసిన వ్యక్తికి ఈ గడ్డపై అడుగుపెట్టే హక్కులేదని స్పష్టం చేశారు. అయినా గానీ కర్నూలు వచ్చి తననే తిడతారని ఆరోపించారు. బీజేపీ వాళ్ల సభకు డబ్బులిచ్చి జనాల్ని తెచ్చుకుంటున్నారని, డబ్బులిచ్చినా జనాలు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. నేడు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అవనిగడ్డ వస్తే కనీసం 100 మంది కూడా లేరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 'అసలు, సిగ్గుందా మీకు?' అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. 'మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది' అంటూ హెచ్చరించారు.
మోదీ పోలవరం ఒక్కసారి కూడా చూడకుండా ప్రాజక్ట్ పనులు పూర్తికాలేదని చెబుతారని అన్నారు. "మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే. పోలవరం నాకు ఏటీఎం అంట! ఈ మోదీ చెబుతారు. అయినా ఇప్పుడు ఏటీఎంల్లో డబ్బులు ఎక్కడున్నాయి! రూ.4,500 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు ఇవ్వడంలేదు. వినుకొండ సభ నుంచి సవాల్ విసురుతున్నా! కేసీఆర్ అంటున్నాడు, పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందట. ఆంధ్రులను అవమానిస్తే కేసీఆర్ ను వదిలిపెట్టం. పోలవరం పూర్తి చేసి నాగార్జున సాగర్ కుడికాలువకు తీసుకెళతాను. ఇది జరిగి తీరుతుంది" అంటూ చంద్రబాబునాయుడు ఆవేశపూరిత ప్రసంగం చేశారు.