IAF: ఆమె హెచ్చరికలు అభినందన్ కు వినిపించి ఉంటే పాకిస్థాన్ కు దొరికేవాడు కాదు!
- ఫిబ్రవరి 27 ఘటనలో కీలకపాత్ర పోషించిన లేడీ ఆఫీసర్
- పాక్ పన్నాగాన్ని ముందే పసిగట్టిన వైనం
- ఆమె పంపిన హెచ్చరికలను బ్లాక్ చేసిన పాక్
బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన మరుసటి రోజే పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకుని రావడం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలకు తెగించి మరీ సరిహద్దు దాటిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ దురదృష్టవశాత్తు శత్రు సైన్యాలకు దొరికిపోయాడు. అయితే, ఓ మహిళా అధికారిణి అభినందన్ సరిహద్దు దాటడాన్ని గుర్తించి వెంటనే హెచ్చరికలు పంపినా, ఆ ఎలక్ట్రానిక్ తరంగాలను పాక్ బ్లాక్ చేసింది. దాంతో, ఆ అలర్ట్స్ అభినందన్ ను చేరలేకపోయాయి. అయితే, ఈ ఘటనకు ముందు ఎంతో ఆసక్తికరమైన మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.
వాస్తవానికి, ఈ దాడి జరిగిన ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళ స్థావరాల్లో అసాధారణ కదలికలు ఉండడాన్ని భారత వాయుసేనకు చెందిన ఓ యువ అధికారిణి గుర్తించి, అందుబాటులో ఉన్న భారత యుద్ధ విమానాలను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో రెండు మిరేజ్-2000లతో పాటు మరికొన్ని సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు సరిహద్దు ప్రాంతంలో గస్తీలో ఉన్నాయి. వెంటనే వాటిని పాక్ యుద్ధ విమానాలు వస్తున్న దిశగా పంపారు.
అంతేకాదు, రాజస్థాన్ లో ఉన్న ఇతర ఎయిర్ బేస్ లకు వెంటనే సమాచారం పంపారు. కానీ, అప్పటికప్పుడు విమానాలు గాల్లోకి లేవాలంటే చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ కావడంతో, అందుబాటులో ఉన్న మిగ్-21 బైసన్లను కూడా ఆ యువ అధికారిణి పాక్ విమానాలు వస్తున్న దిశగా పంపారు. పీర్ పంజాల్ దిశగా గాల్లోకి లేచిన ఆ మిగ్-21 స్క్వాడ్రన్ లోనే అభినందన్ విమానం కూడా ఉంది. ఆ విమానాలు నేరుగా పాక్ విమానాలకు ఎదురెళ్లాయి.
ఇది పాక్ వాయుసేన అస్సలు ఊహించని పరిణామం కావడంతో ఆ విమానాలు అట్నుంచి అటే వెనుదిరిగాయి. వాటిని తరుముకుంటూ మిగ్-21 బైసన్లు రెట్టించిన వేగంతో దూసుకెళ్లాయి. అయితే అవన్నీ సరిహద్దు దాటడం గమనించిన ఆ మహిళా అధికారి 'టర్న్ కోల్డ్, టర్న్ కోల్డ్' అంటూ కోడ్ పరిభాషలో హెచ్చరికలు పంపించారు.
మిగతా విమానాలు ఆ సంజ్ఞలను స్వీకరించి పీఓకే నుంచి వెనుదిరిగినా, వాయువేగంతో దూసుకెళ్లిన అభినందన్ మాత్రం వినలేకపోయాడు. అందుకు కారణం, పాక్ తన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ తరంగాలను బ్లాక్ చేయగలిగింది. దాంతో, అతడు తన విమానం ఇంకా భారత భూభాగంలోనే ఉందని పొరబడి మరింత ముందుకు వెళ్లాడు. అక్కడ పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16తో హోరాహోరీ పోరాడి దాన్ని కూల్చివేసినా, ఆ ప్రయత్నంలో తన విమానం కూడా కూలిపోవడంతో పాక్ సేనలకు పట్టుబడ్డాడు.
అయితే, ఈ మొత్తం ఆపరేషన్ లో కీలకపాత్ర పోషించిన భారత వాయుసేన యువ అధికారిణి పేరును అధికార వర్గాలు గోప్యంగా ఉంచాయి. పంజాబ్ లోని ఓ ఎయిర్ బేస్ లో పనిచేస్తున్నఆమె తెగువను, వ్యూహ చతురతను గుర్తించి త్రివిధ దళాలకు అందించే సేవా పతకానికి ఆమె పేరును సిఫారసు చేశారు.