Congress: ప్రకటించిన కాసేపటికే కుప్పకూలిన కాంగ్రెస్ 'మేనిఫెస్టో' వెబ్‌సైట్!
- కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సోనియా గాంధీ
- వెబ్‌సైట్‌కు పెరిగిన ట్రాఫిక్
- మరింత పకడ్బందీగా తీసుకొస్తామన్న కాంగ్రెస్
మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని రంగాల వారికీ హామీల జల్లు కురిపించిన ఈ మేనిఫెస్టో ప్రారంభించిన కాసేపటికే ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ క్రాష్ అయింది. ట్రాఫిక్ తాకిడి ఎక్కువ కావడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మేనిఫెస్టోను చూసేందుకు జనాలు ఒక్కసారిగా వెబ్‌సైబ్‌ను సందర్శించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపాయి. దీంతో వెబ్‌సైట్‌ను ఈసారి మరింత పకడ్బందీగా రూపొందించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తీవ్రమైన ట్రాఫిక్‌ను సైతం తట్టుకునేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నట్టు కాంగ్రెస్ తెలిపింది.
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కలిసి మంగళవారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగులు, రైతులకు కాంగ్రెస్ బోల్డన్ని హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చిలోగా 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి హామీ పథకం కింద అదనంగా వంద రోజుల పనికల్పిస్తామని, రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ తయారుచేస్తామని హామీ ఇచ్చింది.