congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఏపీకి ప్రత్యేక హోదా
- ప్రజల ఆలోచనలు ప్రతిబింబించేలా మేనిఫెస్టోను రూపొందించామన్న రాహుల్
- పేదలకు ఏడాదికి రూ. 72 వేలు
- 22 లక్షల ఉద్యోగాల భర్తీ
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో జరగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ తదిరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టోను తయారు చేశామని తెలిపారు. గదిలో కూర్చుని దీన్ని రూపొందించలేదని... ప్రజల మనసుల్లో ఉన్న ఆలోచనలు ప్రతిబింబించేలా రూపొందించామని చెప్పారు.
మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు:
- అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటకు కట్టుబడి హోదా ఇస్తాం.
- న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి రూ. 72 వేల చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం పేదల జేబుల్లో డబ్బు నింపుతుంది. ఇదే సమయంలో నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
- ఖాళీగా ఉన్న 22 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం.
- గ్రామీణ ఉపాధి హామీని మరింత పటిష్ఠం చేస్తాం. పని దినాలను 100 రోజుల నుంచి 150కి పెంచుతాం.
- రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించం.
- జీడీపీలో 6 శాతాన్ని విద్య కోసం ఖర్చు చేస్తాం.
- జాతీయ, అంతర్గత భద్రతకు పెద్ద పీట.
- అధికారంలోకి రాగానే రాఫెల్ ఒప్పందంపై విచారణ.
- బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ జరిపిస్తాం.
- వ్యవసాయ అభివృద్ధి, ప్రణాళికలకు శాశ్వత జాతీయ కమిషన్ ఏర్పాటు.
- ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేస్తాం.
- సరళతరమైన జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తాం.