Swiggy: డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేస్తే రూ.200 విలువైన కూపన్ పంపిన స్విగ్గీ
- బెంగళూరులో ఘటన
- డెలివరీ ఇవ్వడానికి వచ్చి అసభ్య ప్రవర్తన
- బాయ్ పై ఫిర్యాదు చేసిన మహిళ
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థ పేరు స్విగ్గీ. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు, కొద్ది వ్యవధిలోనే ఆహారం అందించే సంస్థగా స్విగ్గీ గుర్తింపు సంపాదించుకుంది. అయితే, డెలివరీ బాయ్ ఫుడ్ అందించేందుకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే, అందుకు పరిహారంగా రూ.200 విలువ చేసే ఫుడ్ కూపన్ పంపి అభాసుపాలైంది స్విగ్గీ.
అసలేం జరిగిందంటే, బెంగళూరుకు చెందిన ఓ యువతి గతవారం తనకెంతో ఇష్టమైన ఫుడ్ ను స్విగ్గీలో ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బాయ్, తన పనేదో తాను చూసుకోకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో భయపడిపోయిన ఆ యువతి ఫుడ్ పార్సిల్ ను లాగేసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం, స్విగ్గీ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఆమెకు క్షమాపణలు తెలపడంతో పాటు రూ.200 విలువైన ఫుడ్ కూపన్ ను పంపారు.
ఆ డెలివరీ బాయ్ ప్రవర్తన బాధ కలిగించిందని భావిస్తే, స్విగ్గీ వ్యవహరించిన తీరు మరింత దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన ఈ అవమానాన్ని ఆమె ఫేస్ బుక్ లో పెట్టడంతో స్విగ్గీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పడమే కాదు, ఆ డెలివరీ బాయ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.