Chandrababu: యస్... ఇప్పుడు చెబుతున్నా పోలవరం 'ఏటీఎం' కాదు, 'ఏటీడబ్ల్యూ'!: మోదీకి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
- పోలవరాం ఏటీఎం కాదు ఏటీడబ్ల్యూ
- ఎనీ టైమ్ వాటర్
- దమ్ముంటే ఆపుకోండి చూద్దాం!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు రోడ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే విమర్శనాస్త్రాలు గురిపెట్టారు. పోలవరం ప్రాజక్టును ఏటీఎంగా మార్చుకుని కేంద్రం నుంచి నిధులు పిండుకుంటున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు దీటుగా బదులిచ్చారు.
"పోలవరం మనకందరికీ ఏటీఎం అంట! అసలు ఏటీఎంల్లో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బుల్లేవు. రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వట్టిపోయిన ఏటీఎంగా మార్చేశారు. పోలవరం పూర్తిచేయడం నరేంద్ర మోదీకి ఇష్టంలేదు. అనేక అడ్డంకులు సృష్టించాడు. నేనిప్పుడు హామీ ఇస్తున్నాను, డిసెంబరు లోపల ప్రాజక్ట్ పూర్తవుతుంది. మోదీ, కేసీఆర్, జగన్... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి! నా సత్తా ఏంటో చూపించి పోలవరం పూర్తిచేస్తాం. ఇప్పుడు చెబుతున్నా.. పోలవరం అంటే 'ఏటీఎం' కాదు... యస్.. పోలవరం అంటే 'ఏటీడబ్ల్యూ'. 'ఏటీడబ్ల్యూ' అంటే ఎనీ టైమ్ వాటర్ ఇన్ ద స్టేట్. ఒక బటన్ ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలనుకుంటే ఆ ఊరికి నీళ్లు వెళతాయి. కరెంటు మాదిరిగా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ కుళాయి తిప్పినా నీళ్లే. 24×7 నీళ్లు తెప్పిస్తా. గుజరాత్ లో మీరు చేయలేకపోయారు, నేనిక్కడ చేస్తున్నా, అదే మీకు కుళ్లు" అంటూ మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.