Chandrababu: నరేంద్ర మోదీకి ఓ ముని శాపం ఉంది: పూతలపట్టులో చంద్రబాబు ధ్వజం
- నిజం మాట్లాడితే తల వెయ్యి వక్కలవుతుంది
- అందుకే నిజం మాట్లాడరు
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు తంబళ్లపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఐదేళ్లు నేనెలా పరిపాలించాను, నువ్వెలా పరిపాలించావు? నీ పాలనలో దేశంలో ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు పోయాయా? లేదా? ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందా? లేదా? ఆదాయం రెండింతలు చేస్తామన్నారు, ఎక్కడైనా వచ్చిందా? కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదాయం 128 శాతం పెంచిన ఏకైక ప్రభుత్వం మనదే. తిరుపతి సభలో నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు, చేశారా మరి? మేం చేశాం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి చూపించాం. పోలవరం మన జీవనాడి, అదేదో ఈయనిచ్చినట్టుగా చెబుతున్నారు. జాతీయ ప్రాజక్ట్ అని, అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నరేంద్ర మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.మోదీకి ఓ ముని శాపం ఉంది, నిజం చెబితే తల వెయ్యి వక్కలైపోతుంది. అందుకే మోదీ ఒక్క నిజం కూడా మాట్లాడరు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అమరావతిని చూస్తే మోదీకి కడుపు మండిపోతోందని అన్నారు. ఆయన అహ్మదాబాద్ కంటే మన అమరావతి మించిపోవడం మోదీకి నచ్చడంలేదని తెలిపారు.
"నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహి. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదా కోసం 29 సార్లు తిప్పుకున్నాడు. నాకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చి నాకే కథలు వినిపిస్తున్నాడు. నేను 95లో ముఖ్యమంత్రి అయితే, 2002లో వచ్చాడీ మోదీ. అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారు మీరు, అందుకు మాకేం బాధలేదు. కానీ ఆంధ్ర ప్రజలను కించపరిస్తే సహించేదిలేదు. మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. మీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి. మీ దగ్గరున్న డిపార్ట్ మెంట్లను మాపై ప్రయోగించి ఊడిగం చేయించుకోవాలనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. మీకు ఊడిగం చేయాలనుకుంటే... ఉన్నాడు జగన్! కేసులుండడంతో జైలుకు వెళతానన్న భయంతో ఈ నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నాడు.
మొన్న కర్నూలుకు వచ్చారు, ఇవాళ రాజమండ్రి వచ్చారు. ఏ మొహం పెట్టుకుని మా గడ్డపై అడుగుపెట్టారు? ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలి. ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే వ్యక్తిగత దాడలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలపై దాడి. ఇక్కడి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా? నా కొడుకు, నా కుటుంబం గురించి మాట్లాడతావా నువ్వు? నీ కుటుంబం గురించి చెప్పు వింటాం! నువ్వు ఒకటి అంటే మేం పది అంటాం. నాది యూటర్నా, వెంకన్న సాక్షిగా యూటర్న్ తీసుకుంది మీరు. నాది రైట్ టర్న్. మీరు చేసిన తప్పుడు పనులకు జాతీయ స్థాయిలో వ్యతిరేకించాం. మీరు తీసుకున్న నోట్ల రద్దు ఎవరికైనా ఉపయోగపడిందా? ఇది తుగ్లక్ చర్య. ఈయన నీతి నిజాయతీ గురించి నాకు చెబుతారు" అంటూ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.