UAE: భారత యూనివర్శిటీలు అందించే డిగ్రీలను తమ దేశంలోని డిగ్రీలతో సమానంగా పరిగణించాలని యూఏఈ నిర్ణయం
- భారతీయులకు శుభవార్త
- యూఏఈ విద్యాశాఖ మంత్రిని కలిసిన భారత రాయబారి
- భారత ఉద్యోగార్థుల సమస్యలపై చర్చలు
దుబాయ్, షార్జా, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ ప్రాంతాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అనేక అరబ్ దేశాల నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇప్పటివరకు భారత ఉద్యోగార్థుల అర్హతలకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, భారత్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినా యూఏఈలో అదో సాధారణమైన విద్యార్హత కిందనే పరిగణించేవాళ్లు. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు రానుంది. ఇటీవల యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి అక్కడి విద్యాశాఖ మంత్రి హుస్సేన్ బీన్ ఇబ్రహీంను కలిసి భారత ఉద్యోగార్థుల సమస్యలపై చర్చించారు.
విద్యార్హతల గుర్తింపులో అసమానతలను నవదీప్ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత రాయబారి చెప్పిన విషయాలను సావధానంగా విన్న యూఏఈ విద్యాశాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట భారత్ లోని యూనివర్శిటీలు అందించే డిగ్రీలను యూఏఈ విద్యాసంస్థలు అందించే డిగ్రీలతో సమానంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వపరమైన నిర్ణయం వచ్చినట్టు తెలుస్తోంది.