VV pats: వీవీప్యాట్‌లో స్లిప్పుల లెక్కింపు పిటిషన్ పై విచారణను ఈనెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- ఈవీఎంలో ఓట్లతో పాటు ఈ స్లిప్పులు లెక్కించాలంటున్న విపక్షాలు
- సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబుతో సహా 21 పార్టీలు
- కేసు విచారిస్తున్న జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంల్లోని బ్యాలెట్లతోపాటు, వీవీప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించాలని దేశంలోని మోదీ వ్యతిరేక కూటమికి చెందిన 21 పార్టీలు వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం ధర్మాసనం ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది. పారదర్శకత కోసం వీవీప్యాట్‌లలోని 50 శాతం స్లిప్పులు లెక్కించాలని చంద్రబాబుతో సహా మిగిలిన పక్షాలు పిటిషన్ దాఖలు చేశారు. ఏదో ఒక బూత్‌లోని ఒక శాతం ఓట్లను వీవీ ప్యాట్లలో లెక్కిస్తే సరిపోతుందని పలు కేసుల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయాలని తమ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఈసీ కౌంటర్ అఫిడవిట్‌పై సమాధానానికి కొంత సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి ఈ విధంగా తీర్పు చెప్పారు.