Jagan: జగన్ మామూలు బిడ్డ కాదు... పులిబిడ్డ: వైసీపీలో చేరిన తరువాత హీరో రాజశేఖర్!

  • జగన్ ఎంతో మారిపోయారు
  • అభిప్రాయబేధాలు తొలగించుకున్నాం
  • జగన్ ఎంతో చేయగలరన్న రాజశేఖర్

ఎన్నికలకు ముందే తనకు గతంలో జగన్ తో ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగించుకోవాలని భావించి, ఓ మారు కలుద్దామని వచ్చామని, జగన్ ఎంతో మారిపోయారని, ఒకప్పుడు తాను చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూసిన జగన్ వేరని హీరో రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన భార్య జీవితతో కలిసి లోటస్ పాండ్ కు వచ్చి, జగన్ తో చర్చించి, వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు సూపర్ సీఎం అనుకుంటే, ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారని, అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం తనకుందని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని వ్యాఖ్యానించారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని చెప్పారు. జగన్ తమపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారని పొగడ్తలు కురిపించారు. గతంలో కొన్ని పార్టీలతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని, వాటన్నింటినీ తొలగించుకుంటూ వచ్చానని రాజశేఖర్ చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News