Cricket: బెయిర్ స్టో, వార్నర్ చితకబాదుతుంటే మతిపోయిన వాడిలా కనిపించిన కోహ్లీ!
- సన్ రైజర్స్ భారీ స్కోరు
- బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపిన ఓపెనింగ్ ద్వయం
- హైదరాబాద్ లో పరుగుల వరద
హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం పరుగుల వర్షంలో తడిసిముద్దయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పోరులో ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ పోటాపోటీగా ఆడి సెంచరీలు నమోదుచేయడంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది. మొదట బెయిర్ స్టో 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. బెయిర్ స్టో ధాటికి బెంగళూరు బౌలర్లు బిక్కచచ్చిపోయారు.
మరోవైపు వార్నర్ సైతం ఉతికారేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అసలు తాను ఎక్కడ ఫీల్డింగ్ చేయాలో కూడా మర్చిపోయినట్టుగా కోహ్లీ నిస్సహాయంగా మిగిలిపోయాడు. వార్నర్ 55 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వార్నర్ స్కోరులో 5 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. ఎలాంటి బంతి వేసినా నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లిందంటే బెయిర్ స్టో, వార్నర్ ఎంతలా రెచ్చిపోయి ఆడారో అర్థమవుతుంది.