Andhra Pradesh: వాళ్ల లాగా అమలుకు సాథ్యం కానీ పథకాలను ప్రకటించను: పవన్ కల్యాణ్
- రైతు కన్నీరు తెలిసిన వాడిని
- మేము అధికారంలోకి రాగానే రైతులకు పెన్షన్ ఇస్తాం
- మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇస్తాం
అమలు చేసేందుకు వీలు లేని పథకాలను టీడీపీ, వైసీపీలు ప్రకటించాయని, అలాంటి పథకాలను తాను ప్రకటించనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, వందల కోట్లు, వేల కోట్లు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్లు తీసుకుంటున్నారని, ఆ పెన్షన్ తో వారికేమి అవసరం? దాన్ని కూడా వాళ్లు వదలరని దుయ్యబట్టారు. అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ ప్రభుత్వమూ పెన్షన్ ఇవ్వట్లేదని విమర్శించారు. రైతు కన్నీరు తెలిసిన వాడిని కనుక తమ పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, 58 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడిన వాడే నిజమైన ‘నాయకుడు’ అని అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని యువత కోరుకుంటోందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.