Chandrababu: జగన్ తో పోరాటం అంటే నాకే సిగ్గుగా ఉంది, దేనికైనా సమవుజ్జీ ఉండాలి: తుని సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

  • జగన్ పై 31 కేసులున్నాయి
  • నా మీద ఓ దొంగ కేసు పెట్టారు
  • కోడికత్తి విచారణ కోసం ఎన్ఐఏ కావాలన్నారు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా తుని ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. దేనికైనా సమవుజ్జీ ఉంటేనే పోరాటం రక్తి కడుతుంది, కానీ జగన్ వంటి నేరస్తుడితో పోటీ అంటే నాకే సిగ్గుగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. గతంలో తాను ఎంతోమందితో పోరాడానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి హేమాహేమీలతో ఢీకొట్టానని, కానీ 31 కేసులున్న జగన్ తో ఇప్పుడు పోరాడాల్సివస్తోందని అన్నారు. తునిలో ఆనాడు రైలును తగలబెట్టించిన ఘనుడు జగన్ అని ఆరోపించారు. రౌడీలను తీసుకువచ్చి తునిలో ఘాతుకానికి పాల్పడ్డాడనిచెప్పారు. దేశంలో ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు జగన్ పై ఉన్నాయని ఎద్దేవా చేశారు. తనమీద కూడా ఒక కేసు ఉందని, మహారాష్ట్రలో రైతుల కోసం వెళితే దొంగ కేసు నమోదుచేశారని చంద్రబాబు వెల్లడించారు.

ఒక చిన్న కోడికత్తి దాడిపై ఎన్ఐఏ విచారణ కోరినవాళ్లను ఏమనాలి? అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. "ఈ జిల్లా కుర్రాడే, సానుభూతి వస్తుందని జగన్ ను భుజంలో పొడిచాడు. కోడికత్తి చిన్నది.. దానికి ఎన్ఐఏ విచారణ అవసరమా?" అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News