Andhra Pradesh: పులివెందులకు వెళ్లి ఉత్తరాంధ్ర వాసులు భూములు కొనగలరా? జగన్ ఫ్యామిలీ అడ్డుపడుతుంది!: పవన్ కల్యాణ్
- పులివెందుల నుంచి వచ్చి వేల ఎకరాలు కొన్నారు
- జాగ్రత్త పడకుంటే ఊడిగం చేయాల్సి వస్తుంది
- శ్రీకాకుళం వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించండి
పులివెందులలో భూములు కొనాలంటే జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వెళ్లి రాయలసీమ, పులివెందులలో వెళ్లి భూములు కొనగలరా? అని ప్రశ్నించారు. కానీ పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో బేలా భూములు కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వలసవెళ్లిపోయిన రైతులకు వారి భూమిని తిరిగి అప్పగిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను లాగేసుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ‘ఇలాగే జరుగుతూ పోతే రేపు మనం భూములు లేక బానిసలుగా ఉండాల్సి వస్తుంది. వాళ్లకు ఊడిగం చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
టీడీపీ గత ఐదేళ్లో రాష్ట్రాన్ని దోచేసిందనీ, రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను తిరగనివ్వడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇక వైసీపీ పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏమీ లేదన్నారు. ఈ దోపిడీ సొమ్ములో అచ్చెన్నాయుడు 60 శాతం, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు 40 శాతం పంచుకుంటున్నారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేన ను గెలిపించాలని కోరారు. లేదంటే ఉత్తరాంధ్రను పట్టించుకునేవారే ఉండరని హెచ్చరించారు. శ్రీకాకుళం భాష, యాస, మాండలికంపై తనకు చాలా ప్రేమ ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.