Andhra Pradesh: పలాస సభలో అభిమానుల అతి.. ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్!
- ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ప్రయత్నం
- అతి చేయవద్దని పవన్ కల్యాణ్ వ్యాఖ్య
- ఉత్తరాంధ్రకు చేసే సేవ ఇదేనా? అని ప్రశ్న
పలాస మున్సిపాలిటీలో కళింగ వైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కుదిరితే రిజర్వేషన్ కల్పిస్తామనీ, లేదంటే జనసేన తరఫున మెజారిటీ కళింగ వైశ్యులకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సభావేదిక వద్దకు చేరుకున్న కొందరు యువకులు స్టేజ్ ను పట్టుకుని వేలాడుతూ పవన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించారు. అయితే ఒకటికి రెండుసార్లు వారిని సున్నితంగా పవన్ కల్యాణ్ వారించారు. అయితే వారు మాట వినకపోవడంతో పవన్ కల్యాణ్ చివరికి సహనం కోల్పోయారు.
‘బాబూ.. ఇక్కడ ఉన్నవాళ్లందరూ కొంచెం అతిచేయకండమ్మా.. అతి ఎక్కువ అయింది. ఇది పద్ధతా? ఇదేనా నువ్వు నేర్చుకుంది? నువ్వు ఉత్తరాంధ్రకు చేసేది ఇదేనా? మీరు ఉత్తరాంధ్రకు చేసే సేవ ఇదేనా? ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉండగా ఇదా మీరు చేసేది? అక్కడ అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాదరావు లాంటివాళ్లు గెలిచేది మీలాంటి వాళ్ల వల్లే.
మీకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద కోపం లేదు. కానీ నాకు కోపం ఉంది. అల్లరిచిల్లరిగా మాట్లాడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు’ అని పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చా శ్రీనివాసరావును నిలిపామనీ, ఈయన ఐఎఫ్ఎస్ అధికారి పదవికి రాజీనామా చేసి పోటీచేసేందుకు వచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే శ్రీకాకుళం నుంచి మెట్ట రామారావు వంటి నిజాయితీపరుడు జనసేన తరపున పోటీ చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మార్పు జనసేనతోనే సాధ్యమన్నారు.