malkajgiri: సార్...మీరు జరిమానా చెల్లించాలి : తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి పోలీసుల షాక్
- ప్రచారంలో భాగంగా వెళ్తుండగా ప్రస్తావన
- పాత బకాయిలు ఉన్నాయని చలానాల ప్రదర్శన
- డబ్బు చెల్లించి వెళ్లిన రేవంత్
మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి నిన్న కంటోన్మెంట్ ప్రాంతంలో తిరుమలగిరి పోలీసులు చిన్న షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మీరు ప్రయాణిస్తున్న కారుపై జరిమానా చలానాలు ఉన్నాయని, వాటిని చెల్లించాలంటూ తెలపడంతో ఆశ్చర్యపోవడం రేవంత్ వంతయింది. వివరాల్లోకి వెళితే...ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించిన రేవంత్‌రెడ్డి తాడ్‌బండ్‌లోని శ్రీవీరాంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం న్యూబోయినపల్లి వెళ్తుండగా తాడ్‌బండ్ చౌరస్తాలో సిగ్నల్ పడింది.
ఆ సమయానికి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు రేవంత్ వెళ్తున్న కారు నంబర్‌పై ఉన్న జరిమానా చలానాలను పరిశీలించారు. సైదాబాద్, రాజేంద్రనగర్‌లలో అతివేగం, తప్పుడు పార్కింగ్ చేసినందుకు సదరు కారు నంబర్‌పై రూ.5 వేల జరిమానా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కారు వద్దకు వెళ్లి విషయం రేవంత్‌రెడ్డికి చెప్పగా తొలుత ఆశ్చర్యపోయినా, అనంతరం డబ్బు చెల్లించి ఆయన వెళ్లిపోయారు.