Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని కాగానే భార్యకు భరణం చెల్లిస్తా!: కోర్టులో భర్త వింత వాదన

  • మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఘటన
  • విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన జంట
  • భరణం చెల్లించాలన్న కోర్టు.. ‘న్యాయ్’ సొమ్ముతో చెల్లిస్తానన్న భర్త

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశంలోని 20 శాతం అత్యంత నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ‘న్యాయ్’గా వ్యవహరించే ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.72,000 అందిస్తామని చెప్పారు.

తాజాగా ఈ పథకానికి సంబంధించి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో భార్యకు భరణం చెల్లించాలని  కోర్టు తెలపగా, న్యాయ్ సొమ్ము రాగానే ఇస్తానని సదరు భర్త న్యాయస్థానానికి జవాబు ఇచ్చాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

భోపాల్ కు చెందిన ఆనంద్ అనే వ్యక్తికి 2006లో దీప్ మాలా అనే మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు.. భార్యకు నెలకు రూ.3 వేలు, కుమార్తె ఖర్చులకు నెలకు రూ.1500 చొప్పున చెల్లించాలని ఆదేశించింది.

దీంతో ఆనంద్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన దగ్గర అంత సొమ్ము లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకం కింద నెలకు రూ.6,000 ఇస్తామని చెప్పారనీ, దాని నుంచి ఈ భరణాన్ని చెల్లిస్తానని చెప్పాడు.

తన బ్యాంకు ఖాతా నుంచి ఈ సొమ్ము నేరుగా భార్యాపిల్లల ఖాతాల్లోకి పడేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేసింది. న్యాయ్ పథకం ద్వారా 25 కోట్ల మంది ప్రజలు లేదా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

  • Loading...

More Telugu News