Chandrababu: కియాను గుజరాత్ తీసుకెళ్లాలని మోదీ ప్రయత్నించారు, కానీ కియా యాజమాన్యం నన్ను నమ్మింది: చంద్రబాబు
- మోదీ ఒత్తిడి పెంచారు
- కానీ కియా ప్రతినిధులు ఏపీలో అడుగుపెట్టారు
- ఎచ్చెర్ల రోడ్ షోలో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి నరసన్నపేట, రాజాం పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు ఎచ్చెర్లలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చింది తానేనని స్పష్టం చేశారు. కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కార్ల తయారీ సంస్థ కియాను గుజరాత్ తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని, కానీ కియా యాజమాన్యం మోదీని కాదని తనను నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టారని చంద్రబాబు వివరించారు.
అంతకుముందు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ, ఏపీకి కియాను తీసుకువచ్చింది మోదీయేనని వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు విస్పష్టంగా బదులిచ్చారు. "కియా మోటార్స్ ను అనంతపురం తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నించాను. మోదీ కూడా కియాను గుజరాత్ తీసుకెళ్లడానికి రంగంలో దిగారు. కియా ప్రతినిధులపై ఎంతో ఒత్తిడి పెంచారు. కానీ కియా ప్రతినిధులు నన్ను నమ్మారు కానీ మోదీని నమ్మలేదు. అందుకే కియా ఏపీలో అడుగుపెట్టింది" అంటూ వివరణ ఇచ్చారు.