Chandrababu: తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికింది చంద్రబాబు అయితే, నువ్వేంటి కేసీఆర్.. జగన్ కు మద్దతిస్తున్నావు?: వీహెచ్ సూటి ప్రశ్న
- ఎల్బీ స్టేడియం సభ అట్టర్ ఫ్లాప్
- కేసీఆర్ సభలకు జనాలు రారు
- అవేమన్నా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలా!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పార్టీ పైనా విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమద్రోహి అయిన జగన్ ను నెత్తినపెట్టుకోవడం ఏంటి? ఉద్యమానికి మద్దతిచ్చిన చంద్రబాబును వ్యతిరేకించడం ఏంటి? అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబును కాదని, జగన్ కు కేసీఆర్ ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడని నిలదీశారు. తెలంగాణ ఉద్యమానికి ఏం చేశాడని టీఆర్ఎస్ పార్టీ జగన్ కు వంతపాడుతోందని ప్రశ్నించారు.
కేసీఆర్ కు ఇదేమీ కొత్తకాదని, తెలంగాణ ఉద్యమకారుడైన హరీశ్ రావునే పక్కనపెట్టారని ఆరోపించారు. ఇక, ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ దారుణంగా విఫలం అయిందని, జనాలు లేక వెలవెలపోయిందని ఆయన విమర్శించారు. అయినా కేసీఆర్ సభలకు జనాలు రావడానికి అవేమన్నా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలా? అంటూ సెటైర్ విసిరారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రాభవం పోయిందనడానికి ఎల్బీ స్టేడియం సభే నిదర్శనమని, ఇకమీదట రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభలు గ్రాండ్ సక్సెస్ అవుతాయని చెప్పారు.