ayodhya: అయోధ్యను అటకెక్కించేసి.. బాలాకోట్ అంశాన్ని వాడుకుంటున్నారు: ఫరూక్ అబ్దుల్లా
- అయోధ్య అంశం ఏమైంది?
- అయోధ్యను బాలాకోట్ మింగేసిందా?
- ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోంది
అయోధ్య అంశాన్ని మర్చిపోయి... ఇప్పుడు పాకిస్థాన్ లోని బాలాకోట్ అంశాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మొన్నటి దాకా అయోధ్యను బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుందని... ఇప్పుడు బాలాకోట్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులను ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. అయోధ్యను కీలక అంశంగా చెప్పుకున్న బీజేపీ నేతలకు ఇప్పుడు ఆ అంశం ఏమైందని ప్రశ్నించారు. అయోధ్యను బాలాకోట్ మింగేసిందా? అని ప్రశ్నించారు. శ్రీనగర్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. ఛత్తీస్ గఢ్ లో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని... ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ప్రధాని మోదీ ఇంతవరకు పరామర్శించలేదని విమర్శించారు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన అంశాన్ని మాత్రం ఎన్నికల సందర్భంగా ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే ఇదని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర తగ్గిస్తామన్న హామీని కూడా మోదీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. దేశ ప్రజలను విడదీస్తున్న శక్తులను ఓడించేందుకు ఈ ఎన్నికలు చాలా కీలకమని చెప్పారు. బీజేపీని జమ్ముకశ్మీర్ కు తెచ్చింది మెహబూబా ముఫ్తీ అని విమర్శించారు.