Andhra Pradesh: 12 క్రిమినల్ కేసులున్న నేరస్తుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.. సిగ్గుగా లేదా?: మోదీపై చంద్రబాబు ఆగ్రహం

  • ప్రధాని మోదీని భరతమాత క్షమించదు
  • రాయలసీమలో హింస ప్రేరేపించేందుకు యత్నించారు
  • గాంధీపై గౌరవం ఉంటే ఇన్ని అబద్ధాలు చెప్పేవారు కాదు

ప్రధాని నరేంద్ర మోదీని భరతమాత క్షమించదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 క్రిమినల్ కేసులు ఉన్న నేరస్తుడికి అనుకూలంగా వ్యవహరించడానికి సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. ‘మోదీజీ..అలాంటి నేరస్తులకు మీ కార్యాలయంలో ఎందుకు రెడ్ కార్పెట్ తో స్వాగతిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, మెట్రో లైన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇది ఏపీకి వ్యతిరేకంగా కుట్ర చేయడం కాదా? అని నిలదీశారు.

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమలో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించేందుకు ప్లాన్ వేయలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ భారత్ లో భాగం కాదా? మాపై ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారు? కేవలం ఐదేళ్ల వయసున్న ఏపీపై ఇంత వివక్ష ఎందుకు? ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా?  గాంధీ మహాత్ముడు పుట్టిన గడ్డ నుంచి వచ్చి, ఆయనపై కొంచెం గౌరవం ఉన్నా మీరు ఇన్ని అబద్ధాలు చెప్పేవారే కాదు. అధికారం కాపాడుకోవడమే మీకు ముఖ్యమని ఇప్పుడు దేశమంతటికీ తెలుస్తోంది’ అని మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన చంద్రబాబు.. #ModiIsAMistake అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.

  • Loading...

More Telugu News