Chandrababu: మా అబ్బాయేమీ గాలికి రాలేదు, స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్నాడు: మోదీకి చంద్రబాబు కౌంటర్
- నాకు కుటుంబం ఉంది... విలువలు తెలుసు
- మీకెవరున్నారు?
- రాజమండ్రి రోడ్ షోలో చంద్రబాబు విమర్శలు
కర్నూలు సభలో తనపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. తనపైనా, తన కుమారుడు లోకేశ్ పైనా మోదీ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము రాష్ట్రానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకుంటే ఎగతాళి చేస్తున్నాడని మండిపడ్డారు. గుజరాత్ కు వైబ్రాంట్ గుజరాత్ అని పెట్టుకున్నారని, ఎవరి పేరు బాగుందో చెప్పాలని సభికులను ప్రశ్నించారు.
"సోలార్ ఎనర్జీని తానే ఇచ్చానని మోదీ చెబుతున్నాడు. మీరిచ్చేదేంటి? ఆ ప్రాజక్ట్ కు భూమి ఇచ్చింది నేను. మీ దయాదాక్షిణ్యాలు మాకవసరం లేదు. ప్రపంచం అంతా ఏపీకి వస్తున్నారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టడానికి కారణం, మనం తూర్పు దిక్కున ఉన్నామనే. మనకు ఇప్పుడా సూర్యుడే సోలార్ ఎనర్జీ ఇస్తున్నాడు, అంతకంటే ఏంకావాలి! నరేంద్ర మోదీ సన్ సెట్ అంటున్నాడు! ఎస్ యు ఎన్ కాదు ఎస్ ఓ ఎన్ అంట! నా కొడుకు సెట్ అంట! మీకు నరేంద్ర మోదీ కుటుంబం గురించి తెలుసా? (నవ్వుతూ) అయినా, నేనా విషయం చెప్పదలుచుకోలా!
కానీ నాకు కుటుంబ విలువలు తెలుసు. నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, చిన్నవాడు మనవడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. మరి మీ కథేంటి నరేంద్ర మోదీ గారూ? మీకెవరైనా ఉన్నారా? విలువలేమైనా ఉన్నాయా? కుటుంబ సంప్రదాయాలేమైనా ఉన్నాయా? ఎర్రన్నాయుడు, బాలయోగి వంటి నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో మేం విజ్ఞత చూపించాం. అందుకే వారి వారసులకు అవకాశం ఇచ్చాం.
అయినా నా కొడుకు గురించి మాట్లాడారు మీరు? మా అబ్బాయేమైనా గాలికి వచ్చాడనుకున్నారా? స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్నాడు. లోకేశ్ రాజకీయాల్లోకి రావాలని కూడా మేం కోరుకోలేదు. వ్యాపారాలు కూడా ఉన్నాయి. నాన్నా, మీలాగానే ప్రజాసేవా రంగంలోకి వస్తానని చెప్పాడు. మీ ఇష్టం ఇందులో కష్టాలుంటాయి అని చెప్పాను. ఎలాంటి అవినీతి లేని యువ నాయకులను విమర్శించడం సరికాదు. ఇప్పుడు కోడికత్తి పార్టీతో కలిసి మోదీ కత్తి రాజకీయాలు చేస్తున్నాడు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.