Chandrababu: ఆయన పేరే వడ్డికాసులవాడు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు: మోదీపై చంద్రబాబు విసుర్లు

  • వెంకన్న సాక్షిగా ప్రధాని ఇచ్చిన మాట తప్పారు
  • రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారు
  • రాజమండ్రి రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగం

రాజమండ్రి రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బాబు, గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ ఓ మోసగాడని, ఇచ్చిన మాటను తప్పిన నమ్మకద్రోహి అని అన్నారు. తిరుపతిలో వెంకన్నస్వామి సాక్షిగా ఆడిన మాటను తప్పారంటూ విమర్శించారు.

దేవుళ్ల పేరు చెప్పుకునే బీజేపీ వెంకటేశ్వరస్వామినే మోసం చేసే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇలాంటివారిని వెంకటేశ్వరస్వామి వదిలిపెట్టడని అన్నారు. వెంకటేశ్వరస్వామికి వడ్డికాసులవాడు అని పేరుందని, ఆయన వడ్డీతో సహా వసూలు చేస్తాడని, మోదీ ఈ విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో అండగా ఉంటామని, విభజన చట్టంలో హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పాడని, ఓసారి మోదీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

"ఇవాళ తాను కాపలాదారు అంటున్నాడు. ఎవరికి కాపలాదారు? దొంగలకు, నేరస్తులకు కాపలాదారు అయ్యారు. పోలవరం ఇచ్చానని చెబుతున్నారు, మీరిచ్చేదేంటి పోలవరం? విభజన చట్టంలో హామీలు స్పష్టంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పటివరకు పోలవరం ఎక్కడుందో కూడా తెలియదు, నాకు చెబుతారు రాజకీయాలు? మన రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం ఇచ్చానని చెబుతున్నాడు. అది మా హక్కు కాబట్టే ఇచ్చారు. అమరావతి పనుల్లో జీఎస్టీ కింద రూ.6000 కోట్లు కడుతున్నాం, ఎవడబ్బ సొమ్మనుకుంటున్నారు? మేం ఏమన్నా మీ బానిసలం అనుకుంటున్నారా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

మోదీ గుజరాత్ సీఎంగా 12 ఏళ్లు పనిచేశారని, తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల 9 నెలలు పనిచేశానని బాబు చెప్పుకొచ్చారు. అయితే, తాను హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపే అభివృద్ధి చేశానని, మరి, మోదీ అహ్మదాబాద్ కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్ కు అహ్మదాబాద్ కు ఏమన్నా పోలిక ఉందా? అభివృద్ధిలో ఎవరు ముందున్నారు? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News