Uttar Pradesh: పోలీసులకు మద్యం తాగించి పరారైన కరుడుగట్టిన నేరస్తుడు

  • కోర్టుకు తీసుకెళుతుండగా ఘటన
  • పోలీసులను ఏమార్చిన గ్యాంగ్ స్టర్
  • ఉత్తరప్రదేశ్ లో తీవ్ర కలకలం

ఓ న్యాయవాదిని చంపిన కేసులో జీవితఖైదు ఎదుర్కొంటున్న కరుడుగట్టిన హంతకుడు పోలీసులకు మద్యం తాగించి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 50 ఏళ్ల వయసున్న బద్దన్ సింగ్ ఉరఫ్ బద్దూ 1996లో ఓ న్యాయవాదిని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిపై ఇతర హత్యానేరాలు, దోపిడీలు అన్నీ కలిపి 12 కేసుల వరకు ఉన్నాయి. అయితే, గురువారం మధ్యాహ్నం ఫతేగఢ్ జైలు నుంచి ఘజియాబాద్ న్యాయస్థానానికి తీసుకెళుతుండగా పోలీసుల కక్కుర్తిని ఆసరాగా చేసుకుని సునాయాసంగా ఉడాయించాడు.

పోలీసు వ్యాన్ మీరట్ సమీపానికి రాగానే, తన అనుచరులు ఓ ధాబాలో విందు ఏర్పాటు చేశారని పోలీసులకు చెప్పాడు. దాంతో, పోలీసులు తమ వాహనాన్ని బద్దూ చెప్పిన చోట ఆపారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న బద్దూ అనుచరులు అందరికీ అదిరిపోయేలా విందు ఏర్పాటు చేశారు. పోలీసులకు పీకలదాకా మద్యం పోయడంతో వారు మత్తులో మునిగిపోయారు. ఇదే అదనుగా బద్దూ అక్కడ్నించి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు బాధ్యులుగా ఆరుగురు పోలీసు ఆఫీసర్లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News