Andhra Pradesh: ‘అమ్మా విజయమ్మా.. షర్మిలా.. మీరు సెంటిమెంట్ తో ఓట్లు కురిపించి వెళ్లిపోతే మా గతి ఏం కావాలి?’: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
- అక్రమార్కుడి చేతిలో నలిగిపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?
- జగన్, షర్మిల, విజయమ్మ కలిసి వచ్చినా ఓట్లు పడవు
- జగన్ అవినీతిని ఏపీ ప్రజలు మర్చిపోలేదు
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ జగన్ కన్నతండ్రి శవం పక్కనే సంతకాలు సేకరించారని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ విషయంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో బేరసారాలు చేశాడని ఆరోపించారు. తనను సీఎం చేస్తే రూ.1,500 కోట్లు ఇస్తానని జగన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పారనీ, ఈ విషయాన్ని కడపలో ఫరూక్ అబ్దుల్లా ప్రస్తావించిన అంశాన్ని గుర్తుచేశారు. ఇందుకే జగన్ కు అవకాశం ఇవ్వమంటారా విజయమ్మ గారూ? అని ప్రశ్నించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన విజయమ్మ ఇప్పుడే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల పరిస్థితి కూడా అంతేనన్నారు. ‘అమ్మా విజయమ్మ గారూ.. షర్మిల గారూ.. మీరు ప్రచారానికి వస్తారు. ప్రచారం చేస్తారు. సెంటిమెంటుతో ఓట్లు కురిపించుకుని వెళ్లిపోతారు. తర్వాత మా గతి ఏంకాను? రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? జగన్ అనే ఓ అవినీతిపరుడు, అక్రమార్కుడి చేతిలో మేం నలిగిపోతే మేం ఎవరికి చెప్పుకోవాలి? అందుకే చెబుతున్నాం. సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ, స్టాండింగ్ ప్రెసిడెంట్ షర్మిల, వాకింగ్ ప్రెసిడెంట్ జగన్ చెప్పినంత మాత్రన మీకు ఓట్లు పడవు. జగన్ అవినీతి ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. వాళ్లు ఇంకా మర్చిపోలేదు’ అని వ్యాఖ్యానించారు.